మెగా హీరోలు రామ్చరణ్ అల్లు అర్జున్ లతో కలిసి నటించిన కాజల్ పవన్ కళ్యాణ్ తోనూ జోడీ కట్టాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది. కొన్నిసార్లు ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ఇక ఈసారి మాత్రం వీరిద్దరి జోడీ పక్కా అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కథానాయకుడి గా నటిస్తున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ `సర్దార్`లో కథానాయికగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్టు ప్రచారం సాగుతోంది. తొలుత ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. పవన్ అనీషాలపై ఫొటోషూట్ లు కూడా చేశారు. కానీ కొన్నికారణాల వల్ల అనీషాని సినిమా నుంచి తప్పించినట్టు తెలుస్తోంది.
పవన్కి తగ్గట్టుగా ఓ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. చివరికి ఆ అవకాశాన్ని కాజల్ కి ఇచ్చారనీ ఇటీవలే చిత్ర దర్శకుడు బాబీ కాజల్ మధ్య కథ గురించి డిస్కషన్స్ కూడా జరిగాయని తెలిసింది. ఈ నెల 29 నుంచి సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలవుతోంది. ఈ షెడ్యూల్ నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. పవన్ తో పాటు హీరోయిన్ కూడా సెట్స్ కి వస్తుందట. సో... ఆ రోజే సినిమాలో కథానాయిక ఎవరన్నది తేలిపోనుంది. చిత్రబృందం మాత్రం అటు సినిమా పేరు గురించి కానీ ఇటు హీరోయిన్ గురించి కానీ బయటకి చెప్పడం లేదు.